'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమంపై పిటిషన్.. సజ్జల, సీఎస్ సహా పలువురికి హైకోర్టు నోటీసులు
- రాజకీయ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారంటూ పిటిషన్
- అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ
- జగన్ ను కీర్తించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నారన్న పిటిషనర్
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నియంత్రించాలని పిటిషన్ లో కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచలన మేరకు ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. సజ్జలతో పాటు చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ కార్యక్రమంలో వైసీపీతో కలిసి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పని చేయాలని మీడియా సమావేశంలో సజ్జల బహిరంగంగా చెప్పారని పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని... అధికార పార్టీకి ఓటు వేసేలా ప్రజలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ను కీర్తించడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సజ్జల, చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.