Uttarakashi tunnel rescue: సొరంగం నుంచి బయటపడిన కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ

  • ఫోన్‌ ద్వారా 41 మంది కార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న ప్రధాని
  • కార్మికుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తి అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశంస
  • రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిపై ప్రశంసల జల్లు
Prime Minister Modi spoke to the survived workers in Uttarakashi tunnel rescue operation

‘ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్’ విజయవంతమవ్వడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి అపాయం లేకుండా 41 మంది కార్మికులు బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అర్ధరాత్రి కార్మికులను ఫోన్‌లో పరామర్శించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారని అధికారులు వెల్లడించారు.

మరోవైపు సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను రక్షించేందుకు 17 రోజులపాటు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించిన సిబ్బందిపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైన వెంటనే ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు చేసిన ప్రయత్నాలను మెచ్చుకున్నారు. మానవత్వానికి, టీమ్ కృషికి ఈ రెస్క్యూ ఆపరేషన్ అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని అభినందించారు. ‘‘ ఉత్తరకాశీలో మన సోదరుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని సొరంగంలో చిక్కుకున్న స్నేహితులకు నేను చెప్పాలనుకుంటున్నాను. మీరంతా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

ఇదిలావుంచితే 41 మంది కార్మికులను కాపాడేందుకు 17 రోజులపాటు యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగించిన సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా ‘ర్యాట్ హోల్ మైనర్స్’పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న సిల్క్యారా సొరంగం కూలడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించిన అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలు కూడా విఫలమవ్వడంతో ‘ర్యాట్ హోల్ టెక్నిక్’ని ఉపయోగించిన విషయం తెలిసిందే.

More Telugu News