Ruturaj Gaikwad: గైక్వాడ్ రికార్డు సెంచరీ... టీమిండియా భారీ స్కోరు

  • గువాహటిలో మూడో టీ20
  • ఆసీస్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు
Gaikwad record century drives Team India for huge total

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ విధ్వంసక సెంచరీ సాధించిన వేళ... టీమిండియా భారీ స్కోరు సాధించింది. గువాహటిలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. 

రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ స్కోరులో 13 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఏమంత పసలేని ఆసీస్ బౌలింగ్ ను గైక్వాడ్ తుక్కు కింద కొట్టాడు. గైక్వాడ్ కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. అంతేకాదు, అంతర్జాతీయ టీ20 పోటీల్లో ఆసీస్ పై సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు కూడా గైక్వాడే.

మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 6 పరుగులకే అవుట్ కాగా, ఇషాన్ కిషన్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేయగా... తిలక్ వర్మ 24 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

ఓ దశలో టీమిండియా 81 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అక్కడ్నించి తిలక్ వర్మ జతగా గైక్వాడ్ విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపించాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా టీమిండియా స్కోరును 200 మార్కు దాటించారు. 

 కాగా, లక్ష్యఛేదనను ఆస్ట్రేలియా ధాటిగా ఆరంభించింది. వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ మరోసారి దూకుడుగా ఆడడంతో ఆసీస్ కు పరుగులు ఈజీగా లభించాయి. మరో ఓపెనర్ ఆరోన్ హార్డీ 10 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 56 పరుగులు. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 7 ఫోర్లతో 31 పరుగులు చేయగా, జోష్ ఇంగ్లిస్ 5 పరుగులతో ఆడుతున్నాడు. 

More Telugu News