Kota Student: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఉరివేసుకున్న ‘నీట్’ అభ్యర్థి

  • ఈ ఏడాది ఇది 28వ ఘటన
  • అద్దెకు ఉంటున్న గదిలోనే ఉరివేసుకున్న యువకుడు
  • కారణం కోసం ఆరా తీస్తున్న పోలీసులు
NEET Aspirant Died By Suicide In Rajasthan Kota

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ‘నీట్’కు సిద్ధమవుతున్న 20 ఏళ్ల విద్యార్థి తాను అద్దెకు ఉండే గదిలో నిన్న ఉరివేసుకున్నాడు. అతడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫరీద్ హుస్సేన్‌గా గుర్తించారు. తనలానే పరీక్షలకు శిక్షణ పొందుతున్న మరికొందరితో కలిసి నగరంలో ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు.  

నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకు ఫరీద్‌తో తాము కలిసే ఉన్నామని అతడి రూమ్మేట్స్ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో గది లోపలి నుంచి గడియపెట్టి ఉందని, తలుపు తట్టినా తీయకపోవడంతో ఇంటి యజమానికి విషయం చెప్పినట్టు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు తెరిచారు. లోపల సీలింగ్‌కు వేలాడుతున్న హస్సేన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఫరీద్ ఆత్మహత్యకు కారణం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కోటాలో ఈ ఏడాది ఇది 28వ ఆత్మహత్య. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అన్ని కోచింగ్ సెంటర్లలో యాంటీ హ్యాంగింగ్ పరికరాలను అమర్చాలని నిర్వాహకులను ఆదేశించింది.

More Telugu News