Cricket: భారత జట్టు పాక్ రాకుంటే పరిహారం చెల్లించాలి: పీసీబీ

  • ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్
  • ఈసారి పాక్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ
  • సెక్యూరిటీ కారణాలతో టీమిండియా దూరమయ్యే అవకాశం
Compensate if India refuse to travel to Pakistan for CT 2025 Asks PCB

ఛాంపియన్స్ ట్రోపీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్ కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్ పై సంతకాలు కాలేదు. ఈ మెగా టోర్నీకి తామే ఆతిథ్యమిస్తామని చెబుతున్న పాక్.. టీమిండియా కనుక టోర్నీలో పాల్గొనకుంటే పరిహారం చెల్లించాల్సిందేనని ఐసీసీని డిమాండ్ చేస్తోంది. సెక్యూరిటీ పరంగా వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఓ కొత్త పరిష్కారాన్ని సూచిస్తోంది. టీమిండియా ఆటగాళ్ల సెక్యూరిటీ బాధ్యతలు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని, పాక్ పోలీసులు సహకరిస్తారని తెలిపింది. 

పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే భారత జట్టు టోర్నీకే దూరమయ్యే అవకాశం ఉంది. భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో పాక్ వెళ్లేందుకు ఆటగాళ్లు ఇష్టపడకపోవచ్చని తెలుస్తోంది. బీసీసీఐ కూడా టీమిండియాను పాక్ కు పంపే విషయంపై ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. గతంలో పాక్ ఆసియా కప్ టోర్నీ నిర్వహించగా.. టీమిండియా పాక్ వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఈసారి మాత్రం అలాంటి ప్రత్యామ్నాయానికి అంగీకరించేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదని సమాచారం. ఒకవేళ భారత జట్టు పాకిస్థాన్ కు రాకుంటే ఐసీసీ తమకు పరిహారం చెల్లించాల్సిందేనని పీసీబీ కోరుతోంది.

More Telugu News