K Kavitha: రైతుబంధు కావాలా?.. రాబందులు కావాలా?: ఎమ్మెల్సీ కవిత

  • ఫిర్యాదులతో ఈసీ వెంటపడి మరీ రైతుబంధు ఆపేయించారని ఫైర్
  • కాంగ్రెస్ పార్టీది రైతు వ్యతిరేక విధానమని ఆరోపణ
  • కూలీల పొట్ట కొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎందుకు నిలయదీయడంలేదని కవిత ప్రశ్న
MLC Kavitha Reaction On Election Commission Order

తెలంగాణ రైతులపై తమకున్న ద్వేషాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. రైతుబంధుపై ఈసీకి ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసి, వెంటపడి మరీ ఆపేయించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పారు. ‘రైతుబంధు కావాలా.. రాబందులు కావాలా’ తేల్చుకోవాలంటూ కవిత పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ రైతుల నోటికాడ ముద్దను లాగేశారని కవిత ఆరోపించారు. నిజామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు సగటున రోజుకు రూ.150 కూడా రావడంలేదన్నారు. వేలాది మంది కూలీల పొట్ట కొడుతున్న బీజీపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. పదేళ్ల పాలనలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినన్ని ఉద్యోగాలు దేశంలో మరే రాష్ట్రం కూడా ఇవ్వలేదని కవిత చెప్పారు.

రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కులమతాల పేరుతో చిచ్చులు పెట్టే పార్టీల మాటలు వినొద్దని కవిత హితవు పలికారు. ఇరిగేషన్ కావాలా మైగ్రేషన్ కావాలా.. రైతుబంధు కావాలా రాబందులు కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా లేక 3 గంటల కరెంట్ కావాలా..? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

More Telugu News