IPL-2024: ఐపీఎల్-2024: ఆటగాళ్ల రిటెన్షన్ కు నేడే తుది గడువు

  • ఐపీఎల్ తాజా సీజన్ కు సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
  • తమ జట్లకు కొత్త రూపు కల్పించేందుకు ప్రయత్నాలు
  • ఆటగాళ్లను విడుదల చేసేందుకు, అట్టిపెట్టుకునేందుకు నేడు తుదిగడువు
Time line ends today for players retention in IPL

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ కు నేడు తుది గడువుగా బీసీసీఐ పేర్కొంది. దాంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమకు అక్కర్లేని ఆటగాళ్లను వదిలించుకుంటూ, అవసరమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటున్నాయి. ఈ మేరకు ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేస్తున్న, రిటెన్షన్ చేసుకుంటున్న ఆటగాళ్ల వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ లను అట్టిపెట్టుకుంటోంది. అదే సమయంలో పేసర్లు టిమ్ సౌథీ, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గుసన్ లను విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెన్ స్టోక్స్, భగత్ వర్మ, కైల్ జేమీసన్, మగాలా, సేనాపతిలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. డ్వేన్ ప్రిటోరియస్ ను కూడా సీఎస్కే రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ఇక, ఆటగాళ్ల పరస్పర బదిలీ కూడా జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మయాంక్ దాగర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అప్పగించి, బెంగళూరు జట్టు నుంచి షాబాజ్ అహ్మద్ ను తీసుకుంటోంది. అటు, ఢిల్లీ క్యాపిటల్స్ ముస్తాఫిజూర్ రెహ్మాన్, రిలీ రూసో, రోవ్ మాన్ పావెల్, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్ లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. 

అన్నిటికంటే ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం హార్దిక్ పాండ్యా తిరిగి ముంబయి ఇండియన్స్ గూటికి చేరుతుండడమే. అనేక సీజన్ల పాటు ముంబయి ఇండియన్సకు ఆడిన హార్దిక్... కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా నియమితుడై ఆ జట్టుకు తొలి సీజన్ లోనే టైటిల్ అందించాడు. ఇప్పుడు, హార్దిక్ పాండ్యా మళ్లీ ముంబయి ఇండియన్స్ కు వచ్చేస్తున్నాడు. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య భారీ ఒప్పందం కుదిరినట్టు సమాచారం. హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కు అప్పగించేందుకు గుజరాత్ టైటాన్స్ రూ.15 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. 

కాగా, ఐపీఎల్ తాజా సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబరు 19న జరగనుంది. ఈసారి వేలం దుబాయ్ లో నిర్వహించనున్నారు. విదేశీ గడ్డపై ఐపీఎల్ వేలం జరగనుండడం ఇదే తొలిసారి.

More Telugu News