Fishing Harbour: లోకల్ బాయ్ నానికి ఈ ఘటనతో సంబంధం లేదు... వాసుపల్లి నాని, అతని మామ సత్యం ఈ కేసులో నిందితులు: విశాఖ సీపీ

  • విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం
  • పెద్ద సంఖ్యలో బోట్లు దగ్ధం
  • లోకల్ బాయ్ నాని పనే అంటూ ప్రచారం
  • కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజి
  • మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీపీ రవిశంకర్
Visakha CP press meet on fishing harbour fire accident

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలిపోయిన ఘటనపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు కారణాలను వివరించారు. 

ఈ అగ్నిప్రమాదంతో యూట్యూబర్ నాని (లోకల్ బాయ్ నాని)కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం ఈ కేసులో నిందితులు అని వెల్లడించారు. వాసుపల్లి నాని ఫిషింగ్ బోట్లలో కుక్ గా పనిచేస్తుంటాడని, సత్యం వాచ్ మన్ గా పనిచేస్తుంటాడని తెలిపారు. 

ఘటన జరిగిన రోజున వాసుపల్లి నాని, సత్యం సాయంత్రం 6 గంటల సమయంలో మద్యం తాగేందుకు ఫిషింగ్ హార్బర్ వద్దకు వచ్చారని, అల్లిపల్లి వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన బోటులో మద్యం తాగుతూ, చేపల వేపుడు చేసుకుని తిన్నారని వివరించారు. అయితే, మద్యం మత్తులో సిగరెట్లు తాగుతూ, వాటిని ఆర్పకుండానే పక్కనున్న బోటుపై విసిరారని, ఆ సిగరెట్లు బోటు ఇంజిన్ పై పడడంతో మంటలు చెలరేగాయని వెల్లడించారు. 

ఆ మంటలు నైలాన్ వలలకు అంటుకోవడంతో త్వరితంగా వ్యాపించాయని సీపీ వివరించారు. మంటలు ఉద్ధృతం అవుతుండడంతో వాసుపల్లి నాని, సత్యం అక్కడ్నించి వెళ్లిపోయారని తెలిపారు. 

ఈ కేసులో చాలామంది అనుమానితులను విచారించామని, యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని కూడా విచారించామని తెలిపారు. లోకల్ బాయ్ నానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని తెలియడంతో అతడ్ని విడిచిపెట్టామని సీపీ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కేసులో అసలు నిందితులైన వాసుపల్లి నాని, సత్యం పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. 

కాగా, ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజి కీలకంగా మారింది. ఇద్దరు వ్యక్తులు బోట్లలోంచి బయటికి రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వారిద్దరూ వాసుపల్లి నాని, సత్యం అని పోలీసులు గుర్తించారు.

More Telugu News