Kamareddy: ఎన్నికల గుర్తుకన్నా నీవే బాగున్నావన్న రిటర్నింగ్ అధికారి.. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి ఆందోళన

  • కామారెడ్డిలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న భార్గవి
  • తన ఎన్నికల గుర్తు ఈవీఎంలో సరిగా కనిపించడం లేదని రిటర్నింగ్ అధికారికి చెప్పిన భార్గవి
  • తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆవేదన
Returning officer controversial comments on Women independent candidate in Kamareddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి పట్ల రిటర్నింగ్ అధికారి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. వివరాల్లోకి వెళ్తే... మంగిలిపల్లి భార్గవి కామారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నిన్న కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనిపించడం లేదని రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి దృష్టికి భార్గవి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికల గుర్తు కంటే నీవే చాలా బాగా ఉన్నావని శ్రీనివాస్ రెడ్డి అన్నారని భార్గవి వాపోయారు. ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న తాను కేసీఆర్ పై పోటీ చేస్తున్నానని... తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని అన్నారు. ప్రధాన పార్టీల మహిళా అభ్యర్థులతో ఇలాగే ప్రవర్తిస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ... తాను అసభ్య పదజాలాన్ని వాడలేదని తెలిపారు.

More Telugu News