Local boy nani: మీకు దండం పెడ్తున్నా.. నా జీవితాన్ని నాశనం చేయొద్దు : లోకల్ బాయ్ నాని

  • గంగపుత్ర సోదరులు తనను అర్థం చేసుకోవాలని నాని విజ్ఞప్తి
  • హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ తాను లేనని వివరణ
  • నాలుగు రోజుల పాటు పోలీసులు తనను లోపలే ఉంచారని వెల్లడి
  • కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన యూట్యూబర్ నాని
Local boy Nani Press meet

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో నాలుగు రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించి 30 ఫిషింగ్ బోట్లు కాలిపోయాయి. ఈ ఘటనకు కారణమయ్యారంటూ యూట్యూబర్ నాని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో పోలీసులు నానీని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా శుక్రవారం నాని కోర్టు ముందు ప్రత్యక్షమయ్యాడు. తన లాయర్ తో కలిసి మీడియాతో మాట్లాడాడు. ఫిషింగ్ హార్బర్ ప్రమాదానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో తాను ఓ హోటల్ లో ఉన్నానని, సీసీటీవీ కెమెరాలు కూడా పోలీసులు చెక్ చేశారని చెప్పుకొచ్చాడు. ప్రమాదం విషయం తెలిసి హార్బర్ కు పరుగెత్తుకెళ్లానని వివరించాడు. మంటల్లో తన బోటు కూడా కాలిపోయిందని చెప్పాడు.

ఈ ఘటన ఎలా జరిగిందో, అందులో తన పేరు ఎందుకు వినిపిస్తోందో తెలియడంలేదని నాని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది గంగపుత్ర సోదరులు కూడా తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధించిందన్నాడు. తన మత్స్యకార సోదరులకు, చిన్న చిన్న యూట్యూబర్లకు దండం పెట్టి చెబుతున్నానని, తన జీవితాన్ని నాశనం చేయొద్దని కోరాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, మిగతా వారితో కలిసి మంటలు ఆర్పేందుకు సాయపడ్డానని చెప్పాడు. మరుసటి రోజు పోలీసులు ఫోన్ చేయడంతో స్టేషన్ కు వెళ్లానని వివరించాడు. వెళ్లిన వెంటనే తాను ఫలానా హోటల్ లో ఉన్నానని చెప్పగా.. పోలీసులు అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలు తీసుకొచ్చారని నాని చెప్పాడు.

అందులో తాను కనిపించడంతో తనకు ఈ ప్రమాదంతో సంబంధంలేదని వాళ్లే చెప్పారన్నాడు. అయినా కూడా తనను అక్కడే నాలుగు రోజుల పాటు ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అగ్ని ప్రమాదం కేసులో అందరూ తననే టార్గెట్ చేసినట్లు నాని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, ఏ పార్టీకి తాను సపోర్ట్ చేయట్లేదని వివరణ ఇచ్చాడు. అందరిలాగే నచ్చిన పార్టీకి, అభ్యర్థికి ఓటేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో నిజాలను వెలికి తీసి తనను కాపాడాలని పోలీసులకు, ఉన్నతాధికారులకు నాని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.


More Telugu News