KCR: తెలంగాణ సంపదను మేం పెంచితే, కాంగ్రెస్ దానిని తుంచే ప్రయత్నం చేస్తోంది: మహేశ్వరం సభలో కేసీఆర్

  • మీరు వంట చేసి పెట్టండి.. మేం వడ్డిస్తామన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందన్న కేసీఆర్ 
  • మీ ఓటు అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని వ్యాఖ్య    
  • ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్షమందికి ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్
CM KCR Praja Ashirvada meeting in Maheswaram

తెలంగాణ సంపదను మేం పెంచితే కాంగ్రెస్ తుంచే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే... మీరు వంట చేసి పెట్టండి... మేం వడ్డిస్తామన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రంలో సంపద పెరిగేలా చూశామని, కానీ దానిని కాంగ్రెస్ తుంచే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. మేం మూడోసారి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతామన్నారు. ఓటు అనే అస్త్రాన్ని జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. మీ ఓటు అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.

కందుకూరులో మెడికల్ కాలేజీ రావడానికి, నాలాల అభివృద్ధి జరగడానికి సబితా ఇంద్రారెడ్డి కృషే కారణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ త్వరలో పైప్ లైన్ రానుందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని చెప్పారు. ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిదే కేసీఆర్ అని, కానీ ఈ పథకాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం దుబారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసేసి కాంగ్రెస్ పార్టీ భూమాత తీసుకువస్తే అది భూమేత అవుతుందని ఎద్దేవా చేశారు.

More Telugu News