Catches Ball With Towel: క్రికెట్ మ్యాచ్‌లో కర్చీఫ్‌తో బాల్‌ని అందుకున్న ప్లేయర్.. అంపైర్లు తీసుకున్న నిర్ణయం ఇదే!

  • ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆసక్తికర ఘటన
  • ఫీల్డర్ విసిరిన బంతిని కర్చీఫ్‌తో అందుకున్నందుకు 5 పరుగుల పెనాల్టీ
  • మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం వ్యవహరించిన అంపైర్లు
Umpires 5 Run Penaltyfor Player Catches Ball With Towel in Big bash league

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సహచర ప్లేయర్ అందించిన బాల్‌ని మరో ప్లేయర్ తన చేతిలో ఉన్న హ్యాండ్ కర్చీఫ్‌తో అందుకోవడంతో అంపైర్లు 5 పరుగుల పెనాల్టీ విధించారు. సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 177 పరుగుల లక్ష్యంతో సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది. అమేలియా వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బ్యాట్స్‌ఉమెన్ ఆష్లీ గార్డనర్ బంతిని లాంగ్-ఆన్ వైపు షాట్ ఆడింది. సింగిల్ కూడా వచ్చింది. అయితే ఫీల్డర్ విసిరిన ఈ బంతిని నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ అమేలియా తన చేతిలో ఉన్న కర్చీఫ్‌తో అందుకుంది. దీంతో అంపైర్లు వెంటనే మ్యాచ్‌ను ఆపారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం 5 పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్టు ప్రకటించారు.

మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్స్ ప్రకారం ఈ పెనాల్టీ విధించారు. వికెట్-కీపర్ మినహా మిగతా ఫీల్డర్‌లు గ్లౌజులు లేదా బాహ్య లెగ్ గార్డ్‌లు ధరించి బంతిని అందుకోవడానికి వీల్లేదు. అంపైర్ల అనుమతి తీసుకుంటే మాత్రమే అదనపు ఆటగాళ్లకు అనుమతి ఉంటుందని ఎంసీసీ రూల్స్ చెబుతున్నాయి. అనుమతి కోరితే చేతికి లేదా వేళ్లకు రక్షణ గార్డులను ధరించేందుకు అంపైర్లు అవకాశం కల్పిస్తారు. రూల్స్ విరుద్ధంగా ఒక ఫీల్డర్ దుస్తుల సాయంతో బంతిని అందుకుంటే కనుక అంపైర్లు 5 పరుగుల పెనాల్టీని విధించవచ్చు.

కాగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్‌పై సిడ్నీ సిక్సర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. బ్యాట్స్‌ఉమెన్లు ఆష్లీ గార్డనర్, ఎరిన్ బర్న్స్ రాణించడంతో 19.5 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ లక్ష్యాన్ని ఛేదించింది.

More Telugu News