School Auto: విశాఖలో స్కూల్ ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో ఇదిగో!

School Kids Auto met with Accident In Vishakapatnam
  • 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
  • బుధవారం ఉదయం స్కూలుకు వెళుతుండగా ప్రమాదం
  • బోల్తా పడిన ఆటో.. రోడ్డుపై పడిపోయిన చిన్నారులు
పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటోను ఓ ట్రక్కు వేగంగా ఢీ కొట్టింది.. దీంతో ఆటో బోల్తా పడగా అందులోని చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. విశాఖపట్నంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్, క్లీనర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా.. చుట్టుపక్కల ఉన్న ఆటో డ్రైవర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయాలపాలైన చిన్నారులు బేతని స్కూలు విద్యార్థులని సమాచారం.

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు, మరో సైడ్ నుంచి వస్తున్న స్కూలు పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో రెండు చుట్లు తిరిగి బోల్తా పడింది. లోపల ఉన్న స్కూలు పిల్లలు ఎగిరి బయటపడ్డారు. గాయాలపాలైన చిన్నారులను స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని, మిగతా పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. గాయాలతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న చిన్నారులను చూసి కంటతడి పెట్టారు.
School Auto
Vishaka Accident
Students
Bethani School
Truck auto
Road Accident
vishakapatnam

More Telugu News