Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ వేదికను శ్రీలంక నుంచి తరలించిన ఐసీసీ

  • వరల్డ్ కప్ లో శ్రీలంక దారుణ వైఫల్యం
  • లంక క్రికెట్ బోర్డును రద్దు చేసిన క్రీడల మంత్రి
  • బోర్డులో ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమన్న ఐసీసీ
  • లంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్
  • శ్రీలంకలో  జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ
  • ఈ టోర్నీ దక్షిణాఫ్రికాలో జరుగుతుందని తాజాగా ఐసీసీ ప్రకటన
ICC shifts Under19 Worlod Cup from Sri Lanka to South Africa

వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం చెందడంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ క్రీడల మంత్రి రద్దు చేయడం తెలిసిందే. దాంతో, క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమంటూ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. 

ఈ నేపథ్యంలో, శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక మారింది. అండర్-19 వరల్డ్ కప్ ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నట్టు ఐసీసీ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది. పురుషుల విభాగంలో 15వ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని తెలిపింది.

నేడు ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అండర్-19 వేదిక మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ... శ్రీలంక జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ఐసీసీ టోర్నీల్లో పాల్గొనవచ్చని ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డుకు లభించే నిధులను ఇకపై ఐసీసీ నియంత్రిస్తుంది.

More Telugu News