PM Modi: అది మోదీ డీప్ ఫేక్ వీడియో కాదట!

PM Modi lookalike Vikas Mahante reveals that was not deepfake video
  • ఏఐ టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోల రూపకల్పన
  • ఒరిజినాలిటీకి బాగా దగ్గరగా ఉంటున్న వీడియోలు
  • ఇటీవల మోదీ డీప్ ఫేక్ వీడియో అంటూ ఓ వీడియో వైరల్
  • అయితే ఆ వీడియోలో ఉన్నది తానే అని వెల్లడించిన వికాస్ మహంతే
  • అచ్చం ప్రధాని మోదీని తలపించేలా ఉన్న మహంతే
కృత్రిమ మేధ (ఏఐ)తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అదే స్థాయిలో దుష్ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న డీప్ ఫేక్ వీడియోలను ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. అందుకే అవి ఒరిజినాలిటీకి అత్యంత దగ్గరగా ఉంటున్నాయి. చూపరులకు అది నిజమేనేమో అనే భ్రమను కలిగించే ఈ డీప్ ఫేక్ వీడియోల పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇటీవల రష్మిక మందన్న, కాజోల్ డీప్ ఫేక్ వీడియోలు దిగ్భ్రాంతి కలిగించాయి. ఈ కోవలోనే ప్రధాని నరేంద్ర మోదీ పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న వీడియో కూడా వైరల్ అయింది. ప్రధాని మోదీ సైతం ఇది డీప్ ఫేక్ వీడియో అని చెప్పారు. తాజాగా, అది డీప్ ఫేక్ వీడియో కాదని తేలింది. 

అచ్చం ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉండే వికాస్ మహంతే ఆ వీడియోలో ఉన్నది తానేనని వెల్లడించాడు. వికాస్ మహంతే ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త. బాగా పోల్చి చూస్తే తప్ప ఆయన రూపం అచ్చు గుద్దినట్టు మోదీని తలపిస్తుంటారు. 

ఇటీవల దీపావళి వేడుకల కోసం వికాస్ మహంతే లండన్ వెళ్లాడు. అక్కడ ఓ కార్యక్రమంలో మహంతే కొందరు మహిళలతో డ్యాన్స్ చేయడం వైరల్ అయింది. అయితే, సోషల్ మీడియాలో దీన్ని ప్రధాని మోదీ వీడియో అంటూ సర్క్యులేట్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీ సహా అందరూ దీన్ని డీప్ ఫేక్ వీడియో గానే భావించారు. చివరికి వికాస్ మహంతే తెరపైకి వచ్చి, ఆ వీడియోలో ఉన్నది తానే అని వెల్లడించడంతో అసలు విషయం అందరికీ తెలిసింది.
PM Modi
Vikas Mahante
Deepfake Video
AI

More Telugu News