Team India: ఆసీస్ తో టీ20 మ్యాచ్ కోసం విశాఖ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు!

Team India players arrives Vizag for 1st T20 against Aussies
  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య 5 టీ20లు
  • నవంబరు 23 నుంచి డిసెంబరు 3 వరకు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యం... హైదరాబాదులో 5వ టీ20 మ్యాచ్

ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు ఏపీ తూర్పు తీర నగరం విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. కాగా, ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు వైజాగ్ చేరుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేశ్, రింకూ సింగ్ తదితరులు విశాఖలో అడుగుపెట్టారు. 

కాగా, ఈ సిరీస్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియాలోని చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు చాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు. 

అంతేకాదు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పరుగుల వెల్లువ సృష్టించిన రియాన్ పరాగ్ ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఈ సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ వరల్డ్ కప్ తో ముగియనుంది.


టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే...

నవంబరు 23- తొలి టీ20 (విశాఖపట్నం)
నవంబరు 26- రెండో టీ20 (తిరువనంతపురం)
నవంబరు 28- మూడో టీ20 (గువాహటి)
డిసెంబరు 1- నాలుగో టీ20 (నాగపూర్)
డిసెంబరు 3- ఐదో టీ20 (హైదరాబాద్)

  • Loading...

More Telugu News