ఇన్నాళ్లూ పోలీసులకు భయపడి ప్రజలు బీఆర్ఎస్ను నిలదీయలేదు కానీ...: కిషన్ రెడ్డి
- బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్న కిషన్ రెడ్డి
- బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని వెల్లడి
- బీజేపీ ఓ మాట చెబితే కట్టుబడి ఉంటుందని అందరికీ అర్థమైందని వ్యాఖ్య
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పనులు ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా
- ఉద్యమకారులను బలితీసుకున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు
తెలంగాణ ఉద్యమంలో తొలి విడతలో 369 మంది, మలివిడతలో 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తోన్న ఫేక్ గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉందని, తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ప్రచార రథాలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని, కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రి హామీలపై అధికార పార్టీని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్నాళ్లు పోలీసులకు భయపడ్డారని, కానీ ఎలాగూ కేసీఆర్ దిగిపోతున్నాడని అర్థమై, ఇప్పుడు నిలదీస్తున్నట్లు చెప్పారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నప్పటికీ బీజేపీ... పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదన్నారు.