Team India: క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

  • ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు
  • ఫైనల్లో 2 సిక్సర్లతో ఆసీస్‌పై మొత్తం 86 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్
  • ఇంగ్లండ్‌పై 85 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేసిన టీమిండియా కెప్టెన్
Team Indias captain Rohit Sharma broke another Gris gayle record

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌తో అద్భుత ఆరంభాలను అందించాడు. ఇంకా చెప్పాలంటే బౌలర్లపై ఎదురుదాడి చేయడం అంటే ఏంటో ఈ టోర్నీలో చూపించాడు. మొదటి 10 ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్-2023లో రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 

ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కొట్టిన 2 సిక్సర్లతో ఈ రికార్డు రోహిత్ సొంతమైంది. ఫైనల్ మ్యాచ్‌లో సాధించిన సిక్సర్లతో వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌పై రోహిత్ సిక్సర్ల సంఖ్య 86కు చేరడంతో ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ దిగ్గజం క్రిస్‌గేల్ మొత్తం 85 సిక్సర్లు కొట్టగా దానిని హిట్‌మ్యాన్ అధిగమించాడు. 

 ఇక ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్, క్రిస్ గేల్ తర్వాతి మూడో స్థానంలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ ఉన్నాడు. ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ శ్రీలంకపై 63 సిక్సర్లు బాదాడు. ఇక పాకిస్థాన్‌పై 53 సిక్సర్లు కొట్టిన శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య నాలుగవ స్థానంలో ఉన్నాడు. కాగా ఈ టోర్నీలో క్రిస్ గేల్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా రోహిత్ శర్మ ఇదివరకే బద్దలు కొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బద్దలుకొట్టిన విషయం తెలిసిందే.

More Telugu News