Rohit Sharma: ప్రపంచ కప్‌లో మరో రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

  • ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచిన రోహిత్
  • ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్‌పై 47 పరుగులు చేయడంతో రికార్డు బద్దలు
  • 2019 వరల్డ్ కప్‌లో కేన్ విలియమ్సన్ రికార్డు... అధిగమించిన టీమిండియా కెప్టెన్
Rohit Sharma broke another record in the World Cup

వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మో మరో రికార్డును నెలకొల్పాడు. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అవతరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 47 పరుగులు చేసి ఔటవ్వడంతో ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ మొత్తం పరుగులు 578కి పెరిగాయి. దీంతో 2019 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ (578)ను హిట్‌మ్యాన్ అధిగమించాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ 29వ పరుగు పూర్తి చేశాక ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

మరోవైపు ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానంలో నిలిచాడు. మొత్తం 28 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 1,575 పరుగులు చేశాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (2,278), కోహ్లీ(1,752), పాంటింగ్(1,743) ముందు ఉన్నారు. 

అంతేకాదు, 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ మరో రికార్డును నెలకొల్పాడు. ఒక ప్రపంచకప్‌ ఎడిషన్‌లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. ఫైనల్ మ్యాచ్‌లో 47 పరుగులతో కలుపుకుని మొత్తం 401 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మెక్‌కల్లం పేరిట ఉంది. అతడి రికార్డు 308 పరుగులు కాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు.

More Telugu News