Team India: వరల్డ్ కప్ ఫైనల్: టీమిండియా 240 ఆలౌట్... ఇక భారమంతా బౌలర్ల పైనే!

  • అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
  • టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా
  • ఆసీస్ ముందు 241 పరుగుల టార్గెట్  
Team India all out for 249 runs in world cup final against Aussies

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ నుంచి పరుగుల వెల్లువను ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ కలిగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టైటిల్ పోరులో టీమిండియా 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

టాస్ ఓడినప్పటికీ మొదట బ్యాటింగ్ దక్కడంతో టీమిండియా అభిమానులు ఎంతో సంతోషించారు. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (4) తక్కువ స్కోరుకే అవుటైనా, రోహిత్ శర్మ ఉన్నాడులే అనుకున్నారు. ఆ తర్వాత రోహిత్ (47) అర్ధసెంచరీ కూడా పూర్తి చేసుకోకుండానే అవుటయ్యాడు. 

శ్రేయాస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ బాట పట్టడంతో... కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆదుకుంటారులే అని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. కోహ్లీ 54, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేసి అవుట్ కాగానే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. జడేజా (9) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ అంతసేపు క్రీజులో ఉన్నా చేసింది 18 పరుగులే. 

పిచ్ ఏమాత్రం సహకరించకపోవడం టీమిండియాకు మైనస్ అయింది. పిచ్ మందకొడిగా ఉండడంతో టీమిండియా బ్యాటర్లు తమ సహజమైన ఆటతీరును ప్రదర్శించలేకపోయారు. బంతి పిచ్ అయ్యాక నిదానంగా రావడం ప్రతికూలంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ ఇలాగే అవుటయ్యాడు.

అదే సమయంలో ఆసీస్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగ్గట్టుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్ కు 3, కెప్టెన్ పాట్ కమిన్స్ కు 2, హేజెల్ వుడ్ కు 2, మ్యాక్స్ వెల్ కు 1, ఆడమ్ జంపాకు 1 వికెట్ లభించాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉందనడం అతిశయోక్తి కాదు. 

ఇప్పుడు టీమిండియాను గెలిపించాల్సిన భారం బౌలర్లపైనే పడింది. కొత్త బంతితో బుమ్రా, సిరాజ్ కొన్ని కీలక వికెట్లు తీస్తే, ఆ తర్వాత మహ్మద్ షమీ తన బుల్లెట్ బంతులతో విజృంభించి ఆసీస్ పనిపట్టాలని, జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ తో ఉచ్చు బిగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

More Telugu News