Rohit Sharma: రోహిత్ శర్మ అంత ధైర్యంగా ఆడడానికి కారణం అతడే: ఆశిష్ నెహ్రా

Ashish Nehra talks about Rohit Sharma and Virat Kohli batting
  • వరల్డ్ కప్ లో విశేషంగా రాణిస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
  • తొలి పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న రోహిత్ శర్మ
  • సెంచరీల మోత మోగిస్తున్న కోహ్లీ
  • ఆసక్తికర విశ్లేషణ చేసిన ఆశిష్ నెహ్రా
భారత్ గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ తన ఫామ్ ను పతాకస్థాయిలో ప్రదర్శిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ జట్టుకు అవసరమైన శుభారంభం అందిస్తున్నాడు. బౌలర్ ఎవరన్నది లెక్క చేయకుండా బంతులను అలవోకగా స్టాండ్స్ లోకి పంపుతూ, తొలి పవర్ ప్లేలో టీమిండియా రన్ రేట్ డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 550 పరుగులు చేశాడు.

అటు, విరాట్ కోహ్లీ సైతం తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో సెంచరీల మోత మోగిస్తూ, ఇటీవలే 50వ సెంచరీతో వన్డే క్రికెట్ లో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ లో దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ బ్యాటింగ్ లైనప్ కు వెన్నెముకలాంటి ఇన్నింగ్స్ ఆడుతూ పరుగులు వెల్లువెత్తించాడు. ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 711 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 

ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ, కోహ్లీల బ్యాటింగ్ పై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. "రోహిత్ శర్మ ఇంత నిర్భయంగా, ఇంత దూకుడుగా ఆడుతున్నాడు అంటే అందుకు కారణం విరాట్ కోహ్లీనే. కోహ్లీ ఉన్నాడన్న ధైర్యంతోనే రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ మంచి టైమింగ్ తో బ్యాటింగ్ చేస్తూ ప్రతి మ్యాచ్ లో రాణిస్తున్నాడంటే అందుకు కారణం రోహిత్ శర్మే. రోహిత్ శర్మ ధాటిగా ఆడడం వల్ల, తర్వాత వచ్చే కోహ్లీపై ఒత్తిడి ఉండడం లేదు. దాంతో కోహ్లీ తనదైన శైలిలో ఆడగలుగుతున్నాడు. వీరిద్దరూ నాణేనికి రెండు వైపుల వంటివారు. జట్టు కోసం తమ వంతు కృషి చేస్తున్నారు" అని వివరించాడు.
Rohit Sharma
Virat Kohli
Batting
Ashish Nehra
World Cup

More Telugu News