Amaravati: అమరావతి, పోలవరంలో నిప్పులు పోశారు: రఘురామకృష్ణరాజు

  • అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చూస్తే బాధ కలుగుతోందని వ్యాఖ్య
  • చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని నిర్మిస్తారని ఆశాభావం
  • హైదరాబాద్‌లో జరిగిన ‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
Amaravati and Polavaram projects situation making me painful

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయి ఉంటే రాజధాని అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు. చంద్రబాబుపై అభిమానంతో పలువురు మహిళలు ‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ఏర్పాటు చేశారు. ఈ ఫోరం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌ మినర్వా హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు పలువురు హాజరై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి,  మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాంతోపాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. చంద్రబాబు కోసం ఒక ఫోరం ఏర్పాటుచేసి దాని ద్వారా ఆయన ఆలోచనలను జనాలకు వెల్లడించడం గొప్ప విషయమని కొల్లు రవీంద్ర అన్నారు. ‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ఏర్పాటు చేసిన మహిళలను ఆయన అభినందించారు.

More Telugu News