Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరిస్తేనే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయి: కెనడా

  • కెనడాలో హత్యకు గురైన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్
  • భారత్ హస్తం ఉందంటూ ఆరోపించిన కెనడా ప్రధాని ట్రూడో
  • దెబ్బతిన్న ఇరుదేశాల సంబంధాలు
  • తాజాగా భారత్ పట్ల కఠిన వైఖరి వెలిబుచ్చిన కెనడా
Canada stated that India should cooperate in Nijjar murder probe

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురి కాగా, ఆ హత్య వెనుక భారత నిఘా సంస్థ రా ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందంటూ ట్రూడో కెనడా పార్లమెంటులో వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ భారత్ పట్ల కఠిన వైఖరి వెలిబుచ్చారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్ సహకరించినప్పుడే వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉంటాయని తేల్చి చెప్పారు. 

ప్రస్తుతం కెనడా ప్రభుత్వం నిజ్జర్ హత్య కేసులో నిగ్గు తేల్చేందుకు కృషి చేస్తోందని మేరీ ఎన్జీ తెలిపారు. తమ దేశానికి చెందిన పౌరుడి హత్య కేసులో విదేశీ శక్తుల జోక్యం ఉందన్న ఆరోపణలు రావడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. దర్యాప్తులో సహకరించేలా భారత్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే భారత్ తో సంబంధాలపై ఆలోచిస్తామని మేరీ ఎన్జీ ఉద్ఘాటించారు.

More Telugu News