bsp: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం!

  • నాలుగు రోజుల క్రితం కాగజ్ నగర్‌లో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ
  • ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తనయుడు పునీత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
  • క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఉత్తర్వులు వెలువడే వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం
High Court orders about RS praveen kumar arrest

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదయింది. దీంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఈ నెల 12న రాత్రి కాగజ్ నగర్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఎస్పీ సమావేశాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ప్రచార వాహనాలలో సంగీతాన్ని బిగ్గరగా పెంచారు. ఇది ఘర్షణకు దారి తీసిందని బీఎస్పీ నాయకులు చెబుతున్నారు. తమ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ... ప్రవీణ్ కుమార్, బీఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఇది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత 13వ తేదీ రాత్రి బీఎస్పీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన తనయుడు పునీత్‌పై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదయింది.

More Telugu News