Election commission: ఓటేస్తూ సెల్ఫీ దిగితే నేరుగా జైలుకే..!

  • పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం
  • సిబ్బంది కళ్లుగప్పి తీసుకెళ్లినా సెల్ఫీ దిగే ప్రయత్నం చేయొద్దు
  • ఓటేశాక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటే చిక్కుల్లో పడ్డట్లే..!
Taking Selfie while casting vote Is a crime warns EC

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయాక సెల్ఫీలు దిగి ట్విట్టర్ లోనో ఫేస్ బుక్ లోనో పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది. కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా.. ఇలా చేసే పనేదైనా  సెల్ఫీ దిగడం, దానిని స్నేహితులతో పంచుకోవడం ఎక్కువైంది. నిషేధిత ప్రాంతాల్లోనూ సెల్ఫీలు దిగుతున్న వారు కోకొల్లలు. అయితే, ఈ అలవాటును ఓటేసేటప్పుడు చూపించొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ దిగడం వరకు ఓకే.. కానీ లోపలికి ఫోన్ తీసుకెళ్లినా, ఓటేస్తూ ఫొటో దిగినా చిక్కుల్లో పడతారని చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంపై ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది. పొరపాటునో లేక సిబ్బంది కళ్లుగప్పి లోపలికి తీసుకెళ్లి సెల్ఫీ దిగితే జైలుపాలవుతారని హెచ్చరించింది.

ఓటేస్తూ సెల్ఫీ దిగినా.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా మీ ఓటును పరిగణనలోకి తీసుకోరు. నిబంధనలు అతిక్రమించినందుకు  పోలీస్ కేసు నమోదు చేస్తారు. ఆపై జైలుకెళ్లడం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పదు. మరోవైపు, కళ్లు కనిపించని వారు ఓటేసేందుకు సహాయకుడిని అనుమతిస్తామని ఎన్నికల సిబ్బంది చెబుతున్నారు. అయితే, అప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తినే సహాయకుడిగా అంగీకరిస్తామని, సదరు అంధుడు ఎవరికి ఓటేశాడనే విషయాన్ని బహిరంగ పరచబోనని సహాయకుడిగా వెళ్లే వ్యక్తి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

More Telugu News