Railway gate: యువకుడిని ఢీ కొట్టి 5 కి.మీ. ఈడ్చుకెళ్లిన రైలు.. మంచిర్యాల జిల్లాలో ప్రమాదం

  • ట్రాక్ దాటుతుండగా ఘోరం.. రెండు ముక్కలైన మరో యువకుడి శరీరం
  • మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద ఘటన
  • ప్రమాద స్థలంలో కాంగ్రెస్ నేతల ఆందోళన
Train Accident in Mancherial District

రైల్వే గేటు పడ్డా ఆగకుండా కింది నుంచి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీ కొట్టడంతో ఓ యువకుడి శరీరం రెండు ముక్కలైంది. ఇంజన్ కు చిక్కుకున్న మరో యువకుడిని ఆ రైలు ఐదు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో చోటుచేసుకుందీ విషాదం. స్థానికులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపూర్ సుభాష్ నగర్ కు చెందిన ఎలక్ట్రీషియన్ భూక్యా సురేశ్ (30), పెయింటర్ బాల చందు (40) బుధవారం రాత్రి మంచిర్యాల నుంచి సుభాష్ నగర్ కు బైక్ పై బయలుదేరారు.

క్యాతనపల్లి రైల్వే గేటు పడడంతో కాసేపు వేచి చూశారు. ట్రైన్ ఎంతకీ రావడంలేదని గేటు కింది నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొస్తున్న కేరళ ఎక్స్ ప్రెస్ వారి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో భూక్యా సురేశ్ శరీరం రెండు ముక్కలు కాగా బాల చందు ట్రైన్ ఇంజన్ కింద ఇరుక్కున్నాడు. ట్రైన్ అలాగే ఈడ్చుకుంటూ ఐదు కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల స్టేషన్ దాకా తీసుకెళ్లింది.

అక్కడ రైల్వే పోలీసులు చందు శరీరాన్ని బయటకు తీశారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద విషయం తెలిసి కాంగ్రెస్ నేతలు క్యాతనపల్లి గేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. క్యాతనపల్లి ఫ్లైఓవర్ పూర్తి చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. 2014లోనే నిధులు మంజూరైనా ఇప్పటి వరకూ వంతెన నిర్మాణం చేపట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మండిపడ్డారు. చనిపోయిన యువకుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ఇద్దరి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More Telugu News