Rohit Sharma: వాంఖడేలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు.. టీమిండియా గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందన ఇదే..

  • ప్రశాంతంగా ఉండి చేయాల్సిన పని చేశామని వ్యాఖ్య
  • విలియమ్సన్-మిచెల్ పార్టనర్‌షిప్‌తో ఒత్తిడి అనిపించిందని వెల్లడి
  • విరాట్, అయ్యర్, షమీపై రోహిత్‌ ప్రశంసల జల్లు
Rohit Sharma responds after India beat NZ in semis in World cup 2023

సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన టీమిండియా వరల్డ్ కప్ 2023లో ఫైనల్లో అడుగుపెట్టింది. చివరిలో ఎలాంటి ఉత్కంఠ లేకుండానే భారత్ గెలిచినప్పటికీ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్, సెంచరీ హీరో డారిల్ మిచెల్ భాగస్వామ్యం భారత ఆటగాళ్లనే కాకుండా, ఫ్యాన్స్‌ను కూడా భయపెట్టింది. స్వల్ప స్కోరుకే 2 వికెట్లు కోల్పోయాక వీరిద్దరూ కలిసి ఏకంగా 181 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత శిబిరంలో గుబులు పుట్టించారు. వీరిద్దరి పార్ట్‌నర్‌షిప్‌కి షమీ బ్రేకులు వేయడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అయితే మ్యాచ్ అనంతరం విలియమ్సన్, మిచెల్ పార్టనర్‌షిప్‌పై రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

ముంబై వాంఖడే స్టేడియంలో ఎంతో క్రికెట్ ఆడానని, ఈ మైదానంలో ఎంతపెద్ద స్కోర్ అయినా ఏమాత్రం అలసత్వంగా ఉండకూడదని రోహిత్ అన్నాడు. ప్రశాంతంగా ఉండి చేయాల్సిన పనిని త్వరగా చేయాలని, ఈ మ్యాచ్‌లో అదే చేశామని వివరించాడు. ఒత్తిడిగా అనిపించినప్పటికీ, ఇంగ్లండ్‌పై మ్యాచ్ లో 230 పరుగులే చేసినా అప్పుడు మా బౌలర్లు ఆడుకున్నారు కాబట్టి, ఈ మ్యాచ్‌ కూడా గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పాడు.  మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో హిట్‌మ్యాన్ ఈ విధంగా స్పందించాడు. ఒత్తిడి లేదని చెప్పలేనని, సెమీఫైనల్ కావడంతో అదనపు ఒత్తిడి ఉందని, ఓడిపోతే ముగింపుపడుతుందని తెలుసునని అన్నాడు. లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో చేసిందే చేశామని వివరించాడు. 

‘‘ మేము ఇబ్బందుల్లో పడ్డామని చెప్పడం కష్టమే అవుతుంది. అయితే విలియమ్సన్, మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ సమయంలో మేము ప్రశాంతంగా ఉండటం చాలా దోహదపడింది. మిడిల్ ఓవర్లలో కివీస్ ఆధిపత్యం చెలాయించడంతో వాంఖడేలో ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తిరిగి మ్యాచ్ భారత్ చేతుల్లోకి రావడానికి కేవలం ఒక్క వికెట్ అవసరమైంది’’ అని రోహిత్ వివరించాడు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, కుర్రాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని వివరించారు. విరాట్, శ్రేయాస్ అయ్యర్, గిల్‌పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.

More Telugu News