World Cup Semis: టాస్ గెలిస్తే ఇండియా ఏం ఎంచుకోవాలనే ప్రశ్నకు గవాస్కర్ సమాధానం ఇదే!

  • టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా తేడా ఏమీ ఉండదన్న గవాస్కర్
  • 270 పరుగులు చేస్తే కివీస్ ను ఒత్తిడికి గురి చేయొచ్చని వ్యాఖ్య
  • రోహిత్ తన దూకుడును కొనసాగిస్తాడన్న గవాస్కర్
What Should India Do If They Win Toss vs NZ and this is Sunil Gavaskar Answer

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు తొలి సెమీ ఫైనల్స్ జరుగుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిస్తే ఇండియా ఏం ఎంచుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ... టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా తేడా ఏమీ ఉండదని, ఇండియానే గెలుస్తుందని చెప్పారు. ఇండియా బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉందని... అందువల్ల తొలుత ఫీల్డింగ్ చేసినా నష్టమేమీ లేదని చెప్పారు. 

టాస్ అనేది సమస్యే కాదని అన్నారు. ఒకవేళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పారు. కివీస్ కు భారీ టార్గెట్ ను నిర్దేశిస్తే... ఆ జట్టుపై ఒత్తిడి ఉంటుందని తెలిపారు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే 400 పరుగులు చేయాల్సిన అవసరం లేదని... 260 లేదా 270 పరుగులు చేసినా కివీస్ ను ఒత్తిడికి గురి చేయవచ్చని చెప్పారు. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ 'గేమ్ ప్లాన్' లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరోసారి సత్తా చాటేందుకు టీమిండియా టాప్ 3 పేసర్లు రెడీగా ఉన్నారని గవాస్కర్ తెలిపారు. ఒక్కోసారి తేమ ప్రభావం కూడా కలిసొస్తుందని... కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్ బంతి స్కిడ్ కాకుండా బౌలింగ్ చేయగలడని చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన దూకుడును ఈరోజు కూడా కొనసాగిస్తాడని భావిస్తున్నానని అన్నారు. రోహిత్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడడని... ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేసేలా అటాకింగ్ గేమ్ ఆడతాడని కితాబునిచ్చారు. తొలి 10 ఓవర్లలోనే భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడని... తద్వారా ఆ తర్వాతి 40 ఓవర్లపై మిగిలిన బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.

More Telugu News