Telangana: 29, 30న తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు ‘ఎలక్షన్’ సెలవులు!

  • పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొననుండడమే కారణం
  • ఈసీ సూచన మేరకు ప్రకటన చేయాలని భావిస్తున్న విద్యాశాఖ వర్గాలు
  • విధుల్లో పాల్గొన్నవారికి డిసెంబర్ 1న కూడా సెలవు ఇవ్వాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
Election holidays for government schools in Telangana on 29 and 30

దేశ ఓటింగ్ ప్రక్రియలో ఉపాధ్యాయులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఎన్నికల విధుల్లో పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది విధుల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ తేది నవంబర్ 30, ముందురోజు నవంబర్ 29న రెండు రోజులు ప్రభుత్వ స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం సూచన మేరకు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉపాధ్యాయులు ఈవీఎం యంత్రాలను తీసుకునేందుకు సిద్ధమంటూ 29న ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందు రోజు మధ్యాహ్నానికే పోలింగ్ కేంద్రాలైన పాఠశాలలకు చేరుకుంటారు. ఇక ఎన్నికల విధులు పూర్తయ్యి ఈవీఎంలను సమర్పించే సరికి అర్ధరాత్రి దాటే అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలోని మొత్తం 1.06 లక్షల ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కాబట్టి రెండు రోజులు ప్రభుత్వ బడులకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజయిన డిసెంబర్ 1న కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరారు.

More Telugu News