BTech Ravi: బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!... తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు

  • ఈ సాయంత్రం నుంచి ఆచూకీ లేని బీటెక్ రవి
  • కొప్పర్తి సెజ్ వద్ద బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
  • ఏ కేసులో అరెస్ట్ చేశారో తెలియదంటున్న కుటుంబ సభ్యులు
Police detains BTech Ravi

కడప జిల్లాలో టీడీపీకి ముఖ్యనేతగా కొనసాగుతన్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ సాయంత్రం నుంచి ఆచూకీ లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లోనూ, పార్టీ వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే, బీటెక్ రవిని స్పెషల్ పార్టీ పోలీసులు కొప్పర్తి సెజ్ వద్ద అదుపులోకి తీసుకుని కడప రిమ్స్ కు తరలించినట్టు తెలుస్తోంది. 

బీటెక్ రవిని ఏ కేసులో అరెస్ట్ చేశారన్న దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో కడప ఎయిర్ పోర్టు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీటెక్ రవిపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేశారా, లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియలేదు. 

గన్ మన్లను, డ్రైవర్ ను వదిలేసి బీటెక్ రవిని పోలీసులు తమతో తీసుకెళ్లారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

బీటెక్ రవికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: దేవినేని ఉమా

పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవిని కిడ్నాప్ చేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ఇది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. రవికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.  ఈ విషయంలో పోలీసులు తమకు తెలియదని చెప్పడం దుర్మార్గం అని విమర్శించారు. "బీటెక్ రవి తనపై పోటీ చేశాడని జగన్ కక్ష సాధింపులకు దిగాడు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది. తక్షణమే దీనిపై ముఖ్యమంత్రి డీజీపీ, జిల్లా ఎస్పీ స్పందించాలి" అని ఉమా డిమాండ్ చేశారు. 

More Telugu News