Coconut Water: కొబ్బరి నీళ్లు ఈ సమయంలో తాగితే మంచిదట!

  • అద్భుతమైన ఆరోగ్యకర పానీయంగా కొబ్బరి నీళ్లకు గుర్తింపు
  • ఎండాకాలంలో చాలా మందికి ఇదే ఫేవరెట్ డ్రింక్
  • డీహైడ్రేషన్ కు సహజ ఔషధం
  • ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం మంచిదంటున్న నిపుణులు
Right time to drink Coconut water is

కొబ్బరి నీళ్లు ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది అందరూ అంగీకరించే విషయం. ప్రకృతి సిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కొబ్బరి నీళ్లకు ఉంది. 

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్షతగాత్రులకు కొబ్బరినీళ్లనే సెలైన్ లా వాడారట. కొబ్బరినీళ్లను చలవ చేసే డ్రింక్ గా భావిస్తారు. ఎండా కాలంలో చాలామంది ఫేవరెట్ డ్రింక్ ఇదే. శరీరం చెమట రూపంలో కోల్పోయిన నీటిని ఇది భర్తీ చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. 

కొబ్బరినీళ్లను తాగితే... చర్మం యొక్క తేమ నియంత్రణలో ఉండడమే కాకుండా, బ్యాక్టీరియా సంబంధ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి చర్మానికి లభిస్తుంది. అంతేకాదు, బరువు తగ్గడంలోనూ కొబ్బరినీళ్లు ఎంతో సాయపడతాయట. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయని, వెయిట్ లాస్ కోరుకునేవారికి ఇది మంచి పానీయం అని నిపుణులు వెల్లడించారు. 

అయితే, ఉదయం 10 గంటల  సమయంలో కొబ్బరినీళ్లను సేవించడం ఆరోగ్యరీత్యా మంచిదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు స్పందించారు. 

నోయిడాలోని శారదా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ్ ఏమన్నారంటే... "కొబ్బరినీళ్లను సాయంత్రం తాగడం కంటే పొద్దునే తాగడం మంచిది. అయితే మితంగానే తాగాలి. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజాన్ని అందిస్తుంది" అని వెల్లడించారు. అయితే, రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడమే మంచిదని సూచించారు. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారు, హృదయ స్పందన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొబ్బరి నీరు తాగరాదని డాక్టర్ శ్రీవాస్తవ్ స్పష్టం చేశారు. 

మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ చౌదరి స్పందిస్తూ... ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని తెలిపారు.

More Telugu News