Rohit Sharma: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అల్పబుద్ధి... రోహిత్ ను కాదని కోహ్లీకి డ్రీమ్ టీమ్ కెప్టెన్సీ

  • టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ను ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
  • రోహిత్ శర్మకు దక్కని స్థానం
  • రోహిత్ కంటే తక్కువ పరుగులు చేసిన వారికి స్థానం
  • టీమిండియా స్ఫూర్తిని దెబ్బతీసేందుకేనంటూ అభిమానుల ఆగ్రహం
Cricket Australia gives Team Of The World Cup captaincy to Kohli instead of Rohit

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సాధించిన విజయాలన్నీ ఎంతో సాధికారికంగా సాధించినవే. ప్రతి మ్యాచ్ లోనూ బ్యాట్స్ మెన్, బౌలర్లు తమ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ముఖ్యంగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాను రాణిస్తూ, ముందుండి అందరినీ ఒక్క తాటిపై నడిపిస్తూ టీమిండియాను టోర్నీ లీగ్ దశలో అజేయంగా నిలిపాడు. తన ట్రేడ్ మార్క్ స్ట్రోక్ ప్లేతో ప్రత్యర్థి బౌలర్ల లయను ఆరంభంలోనే దెబ్బతీస్తూ మిగతా బ్యాట్స్ మెన్ కు మార్గం సుగమం చేస్తుండడం ఈ టోర్నీలో చూశాం. హిట్ మ్యాన్ తన బిరుదును సార్థకం చేసుకుంటూ మొత్తం 9 ఇన్నింగ్స్ లలో 503 పరుగులు చేశాడు. 

ఇన్ని ఘనతలు ఇలా కళ్ల ముందు కనిపిస్తుంటే, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంతటి అల్పబుద్ధి ప్రదర్శించిందో చూడండి. ఈ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లలో ప్రదర్శన ఆధారంగా తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మను కాదని విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసింది. గతంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఏ ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ గెలవలేకపోయింది. పైగా కోహ్లీ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. ఈ విషయం తెలిసి కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కోహ్లీని వరల్డ్ కప్-2023 టీమ్ కెప్టెన్ గా పేర్కొంది. 

దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా ఆసీస్ బోర్డు దుష్ట బుద్ధికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తుండడంతో జట్టులో స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, రోహిత్ శర్మను మానసికంగా దెబ్బతీసి, తద్వారా తమ జట్టుకు లబ్ది చేకూర్చడమే ఆసీస్ క్రికెట్ బోర్డు ఉద్దేశంలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ డ్రీమ్ టీమ్ లో డేవిడ్ వార్నర్ కు కూడా ఓపెనర్ కోటాలో స్థానం కల్పించింది. వార్నర్ (499) రోహిత్ శర్మ కంటే తక్కువ పరుగులు చేసినప్పటికీ అతడికి స్థానం ఇవ్వడం గమనార్హం. సఫారీ ఆటగాడు ఐడెన్ మార్ క్రమ్ కూడా రోహిత్ కంటే తక్కువ పరుగులే చేసినా అతడికి కూడా స్థానం కల్పించారు. 

కనీసం రోహిత్ ను 12వ ఆటగాడిగా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, ఆసీస్ క్రికెట్ బోర్డు వైఖరిపై అనుమానాలకు తావిచ్చేలా ఉందని అభిమానులు అంటున్నారు.


ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఇదిగో...

విరాట్ కోహ్లీ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్, రచిన్ రవీంద్ర, ఐడెన్ మార్ క్రమ్, గ్లెన్  మ్యాక్స్ వెల్, మార్కో యన్సెన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్ప్రీత్ బుమ్రా
12వ ఆటగాడు: దిల్షాన్ మధుశంక

More Telugu News