Tunnel: టన్నెల్ లో చిక్కుకున్న 40 మంది వర్కర్లకు ఆహారం అందించిన రెస్క్యూ టీమ్

  • ఉత్తరాఖండ్ లో నేషనల్ హైవేపై టన్నెల్ నిర్మాణ పనులు
  • ఆదివారం పాక్షికంగా కూలడంతో లోపలే చిక్కుకున్న వర్కర్లు
  • టన్నెల్ స్లాబ్ తవ్వి వర్కర్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నం
40 workers Trapped In Uttarakhand Tunnel

ఉత్తరాఖండ్ టన్నెల్ లో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నీళ్లు అందించినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. లోపల చిక్కుకుపోయిన వర్కర్లు అందరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న ఓ టన్నెల్ ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. దీంతో 40 మంది వర్కర్లు లోపలే చిక్కుకుపోయారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి వర్కర్లు లోపలే ఉండిపోయారు. ప్రమాద విషయం తెలిసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ లు రంగంలోకి దిగాయి. టన్నెల్ స్లాబ్ ను తవ్వి వర్కర్లను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే 20 మీటర్ల మేర స్లాబ్ తొలగించినట్లు ఉత్తరకాశీ సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరో 35 మీటర్ల దాకా తవ్వాల్సి ఉందని వివరించారు. దీంతో పాటు టన్నెల్ కూలడంతో పూడుకుపోయిన మార్గాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం ఎక్స్ కవేటర్లతో పాటు భారీ మెషీన్లను ఉపయోగిస్తున్నామని వివరించారు. 

టన్నెల్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే..
సిల్క్యారా, దండల్ గావ్ లను కలిపేందుకు బ్రహ్మఖల్- యమునోత్రి నేషనల్ హైవేపై ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టింది. ఈ టన్నెల్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తరకాశీ నుంచి యమునోత్రి మధ్య దూరం 26 కిలోమీటర్లు తగ్గనుంది.

More Telugu News