Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మొద్దు: జేడీఎస్ అధినేత కుమారస్వామి

  • కర్ణాటకలో అమలు చేయకుండా తెలంగాణలో హామీలు ఇవ్వడం విచిత్రంగా ఉందని ఎద్దేవా
  • గ్యారంటీల పేరుతో ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందని మండిపాటు
  • కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు విఫలమయ్యాయని ఆరోపణ
Do not trust Congress promises in Telangana says JDS chief Kumaraswamy

తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మొద్దని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని, రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని కర్ణాటకలో చెప్పారని, కానీ అమలుచేయలేదని అన్నారు. ఈ మేరకు బెంగళూరులోని జేడీఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మాట్లాడారు. గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు. 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడంలేదని పేర్కొన్నారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలు చేయడం లేదని  విమర్శించారు. కర్ణాటకలో అమలుచేయలేని వారు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణలో రైతుబంధు విజయవంతంగా అమలవుతోందని అన్నారు. ఎకరానికి రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

More Telugu News