Ravi Shastri: టీమిండియా ఇప్పుడు కప్ గెలవలేకపోతే మరో 12 ఏళ్లు ఆగాల్సిందే: రవిశాస్త్రి

  • భారత గడ్డపై వరల్డ్ కప్ టోర్నీ
  • అమోఘంగా రాణిస్తున్న టీమిండియా
  • ఈసారి కప్ మనదే అనిపిస్తోందన్న రవిశాస్త్రి 
  • టీమిండియాలో పలువురికి ఇదే చివరి కప్ అని వెల్లడి 
Ravi Shastri opines on Team India winning chances in World Cup

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఆడుతున్న తీరు పట్ల మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడుతోందని, మనవాళ్ల ఊపు చూస్తుంటే కప్ గెలిచేందుకు ఇదే మంచి తరుణం అని పేర్కొన్నారు. 

టీమిండియాలో ప్రస్తుతం ఏడెనిమిది మంది భీకర ఫామ్ లో ఉన్నారని, వారిలో చాలామందికి ఇదే చివరి వరల్డ్ కప్ అని తెలిపారు. ఇంత మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కప్ గెలవలేకపోతే, మళ్లీ ఆ స్థాయిలో ఆడి కప్ గెలవాలంటే మరో మూడు వరల్డ్ కప్ ల (12 ఏళ్లు) వరకు ఆగాల్సిందేనని అన్నారు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఆడుతున్న తీరు, పిచ్ లు, సాధిస్తున్న విజయాలను పరిశీలిస్తే... ఈసారి కప్ మనదే అనిపిస్తోందని రవిశాస్త్రి పేర్కొన్నారు. 

ఇక, టీమిండియా పేస్ త్రయం మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వన్డే క్రికెట్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని కొనియాడారు. సీమ్ పొజిషన్, స్వింగ్ రాబట్టే విధానం అమోఘం అని కితాబిచ్చారు. ఇంతటి బలమైన పేస్ విభాగం భారత్ కు ఎప్పుడూ లేదని, అయితే ఇదేమీ రాత్రికి రాత్రి జరిగింది కాదని అన్నారు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ దిశగా ఎంతో కృషి జరిగిందని రవిశాస్త్రి తెలిపారు. భారత పిచ్ లపై ఎక్కడ బంతులు విసిరితే వికెట్లు లభిస్తాయో షమీ, బుమ్రా, సిరాజ్ లకు తెలుసని అన్నారు.

More Telugu News