Team India: పాకిస్థాన్ కథ ముగిసింది... టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలింది!

  • ఇంగ్లండ్ పై అతి భారీ విజయం సాధిస్తే పాక్ కు సెమీస్ చాన్స్
  • ఘోరంగా విఫలమైన పాక్
  • నాలుగో జట్టుగా సెమీస్ కు అర్హత సాధించిన న్యూజిలాండ్
  • తొలి సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్
  • రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ
Team India face off with New Zealand in world cup semifinal

వరల్డ్ కప్ లో నాకౌట్ దశలో ఎవరు ఎవరితో తలపడతారన్నదానిపై స్పష్టత వచ్చింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో తలపడనుంది. ఇక 2వ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, 3వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

ఇవాళ ఇంగ్లండ్ పై అతి భారీ విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశం ఉందని సమీకరణాలు చెబుతుండగా, భారీ విజయం మాట అటుంచి పాక్ ఘోరంగా ఓడిపోయింది. 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇంగ్లండ్ నిర్దేశించిన 338 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ 6.4 ఓవర్లలో ఛేదిస్తే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో పాక్ సెమీస్ చేరుతుంది. కానీ, పాక్ ఈ విషయంలో విఫలం కావడంతో మ్యాచ్ పూర్తి కాకముందే ఆ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. దాంతో న్యూజిలాండ్ జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది. 

టీమిండియా (16), దక్షిణాఫ్రికా (14), ఆస్ట్రేలియా (14) ఇప్పటికే సెమీస్ చేరడం తెలిసిందే. ఇప్పుడు పాక్ నిష్క్రమణ నేపథ్యంలో కివీస్ నాలుగో జట్టుగా సెమీస్ కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో 10 పాయింట్ల సాధించింది. 

భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో మొదటి సెమీఫైనల్ ఈ నెల 15న ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరగనుంది. రెండో సెమీఫైనల్ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఈ నెల 16న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

More Telugu News