Manda Krishna Madiga: పెద్దన్నా... మీరు వస్తున్నారంటే ఈ సమస్య పరిష్కారమైనట్లే!: మోదీపై మంద కృష్ణ మాదిగ ప్రశంసలు

  • నా జాతిని ఆదుకోవడానికి వచ్చారంటూ మోదీపై మంద కృష్ణ మాదిగ ప్రశంసలు 
  • మీకు దణ్ణం పెడుతున్నాను... 30 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామన్న మంద కృష్ణ
  • మీ మనసు వెన్నపూస... మీరు హామీ ఇస్తే ఎన్ని అవాంతరాలు వచ్చినా నెరవేర్చుతారన్న మంద కృష్ణ
Manda Krishna Madiga on PM Narendra Modi in Viswarupa public meeting

'పెద్దన్నా... మీరు వస్తున్నారంటే ఈ సమస్య (ఎస్సీ వర్గీకరణ) పరిష్కారమైనట్లే'నని నాతో చాలామంది చెప్పారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి అన్నారు. పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ... నా జాతిని ఆదుకోవడానికి వచ్చిన ప్రధాని మోదీ, మన వద్దకు ఆయనను తీసుకువచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ అంటూ మంద కృష్ణ ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్నా... మీకు తమ్ముళ్లుగా మేం భావించుకుంటున్నాం.. మీకు దణ్ణం పెడుతున్నాను... 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమం ప్రారంభమైందని, 30 ఏళ్లుగా తాను న్యాయం కోసం పోరాడుతున్నానని చెప్పారు.

మాదిగలకు అన్యాయం జరిగిందనే ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నామన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి కమిషన్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు వేసిన కమిషన్లు కూడా మాదిగలకు అన్యాయం జరిగినట్లు చెప్పాయని, కానీ ఎవరూ న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు. మా వాటా మాకు దక్కాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి.. కానీ హామీని మాత్రం నెరవేర్చలేదన్నారు. మాకు జరిగిన అన్యాయం ఇప్పుడు మీ ముందు పెడుతున్నామని, పండిట్ దీన్ దయాల్ చెప్పిన అంత్యోదయ, అంబేడ్కర్ చెప్పిన సమసమాజం... ఈ రెండింటికి ప్రతిరూపం వర్గీకరణ డిమాండ్ అన్నారు. కానీ ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

మీ మనసు వెన్నెపూస...

అన్నా.. మీ మనసు చాలా వెన్నపూస.. గుండె చాలా గట్టిది.. ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, నిందలను తట్టుకొని మీరు ప్రధానిగా... ప్రపంచనేతగా ఎదిగారని మోదీని ఉద్దేశించి అన్నారు. మీకు అంత గుండె నిబ్బరం ఉన్నప్పటికీ మీ మనసు మాత్రం చాలా మంచిది అన్నారు. మీ మనసు ఎంత మంచిదో పార్లమెంటులో చూశానని, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమయంలో చిరకాల మిత్రుడు అంటూ మీరు కన్నీరు కార్చారన్నారు.

మీరు ఎవరికో వ్యతిరేకమని చెబుతారు కానీ...

మీరు కొందరికి వ్యతిరేకమని చెబుతుంటారని.. ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేసి ముస్లీంలను ఆదుకున్నది మీరే అన్నారు. ఈ దేశాన్ని ఆదుకున్న ప్రధానులలో మిమ్మల్ని మించిన వారు లేరన్నారు. మీ అన్నగా... తమ్ముడిగా.. మీకు సొంత తమ్ముడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానని, మీరు తల్చుకుంటే కానిది లేదన్నారు. మాకు వర్గీకరణ చేయాలన్నారు. మీరు ఈ విశ్వరూప సభకు వస్తున్నారంటేనే ఈ సమస్య పరిష్కారమైనట్లేనని చాలామంది నాతో చెప్పారన్నారు.

మోదీ హామీ ఇస్తే చాలు...

ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇస్తే దానిని కచ్చితంగా చేస్తారని అందరికీ తెలుసునన్నారు. మోదీ హామీ ఇవ్వరు... ఇస్తే కనుక ఎంత కష్టమొచ్చినా.. ఆ మాటపై నిలబడతారన్నారు. ఇచ్చిన మాటపై నిలబడేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొంటారన్నారు. మీ నిజాయతీతో పాటు మీరు ఇచ్చిన మాట కచ్చితంగా చేస్తారని ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలుసునన్నారు. అందుకే మిమ్మల్ని తమ్ముడిగా కోరుతున్నానని.. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాదిన బీజేపీపై కొంత దుష్ప్రచారం ఉందని, కానీ మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తే దక్షిణాదిలో మెజార్టీ మాదిగలు మీ వెంట ఉంటారని మంద కృష్ణ మాదిగ అన్నారు. మీరు వర్గీకరణ చేస్తే మీకు లక్ష్మణుడిగా తోడుగా ఉంటానన్నారు. 

మంద కృష్ణ మాదిగ ఉద్వేగం

మంద కృష్ణ మాదిగ ప్రసంగమంతా భావోద్వేగంతో చేశారు. చివరలో మాట్లాడుతూ... సభకు వచ్చిన మాదిగ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి... మనకు రాజకీయాలు ముఖ్యమా? జాతి ముఖ్యమా? ఈ పెద్దన్న (మోదీ) మన సమస్యను పరిష్కరిస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఆయనకు శక్తిని ఇద్దామని పిలుపునిచ్చారు. నో కాంగ్రెస్.. నో బీఆర్ఎస్.. నో వేరే పార్టీ.. అన్న మోదీకి మద్దతిద్దామన్నారు. అన్నకు అండగా ఉందామన్నారు.

More Telugu News