Revanth Reddy: హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో ఉంటారు: రేవంత్‌రెడ్డి

  • బీఆర్ఎస్‌లో ఉంటేనే ఉద్యమకారుడు..లేదంటే ద్రోహి అని ముద్ర వేస్తున్నారని రేవంత్ ఆగ్రహం
  • ‘ధరణి’పై మరోమారు ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్
  • అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ‘ధరణి’ పనిచేస్తోందని ఆరోపణ
  • తాను సీఎంను అవుతానని హరీశ్‌రావు చెప్పగలరా?అని ప్రశ్న
TPCC Chief Revanth Reddy Slams Harish Rao

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని, తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని, అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు. తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ.. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అక్కడ సీఎంలు మారారా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ధరణి’పై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

More Telugu News