Cricket: ఆస్ట్రేలియాతో 20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్
  • పాండ్యా గైర్హాజరు నేపథ్యంలో కెప్టెన్‌గా కొత్తవారికి ఛాన్స్
  • విశ్రాంతి కోరకుంటే సూర్యకే అవకాశం ఉందంటున్న బీసీసీఐ వర్గాలు
Suryakumar Yadav as Team India captain for T20 series against Australia

వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించబోయే ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రస్తుతం అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఉంది. ఆసీస్‌తో ఆడనున్న 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌కు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన టీ20 జట్టుకు నాయకత్వం వహించిన రుతురాజ్ గైక్వాడ్‌ కూడా కెప్టెన్ రేసులో ఉన్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్వయంగా విశ్రాంతి కోరుకోకపోతే అతడినే కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నాయి. సూర్య విశ్రాంతి కోరుకుంటే రుతురాజ్ తదుపరి ఆప్షన్‌గా ఉంటాడని తెలుస్తోంది.

కాగా వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియాతో ఆడబోయే జట్టును ప్రకటించే అవకాశాలున్నాయి. నవంబర్ 15న ముంబైలో ఇండియా సెమీస్ మ్యాచ్ ఆడనుంది. హార్ధిక్ పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబరు 10 నుంచి మొదలుకానున్న దక్షిణాఫ్రికా టీ20 పర్యటన నాటికల్లా పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాఫ్రికా సీరిస్‌కు పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదా అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఉందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఆడేందుకు అవకాశాలున్నాయని, అయితే దీనిపై తుది నిర్ణయం నేషనల్ క్రికెట్ అకాడమీలోని వైద్య బృందం పరిధిలో ఉంటుందని చెప్పారు.

More Telugu News