Ishan Kishan: ప్రాక్టీస్ లో టీమిండియా క్రికెటర్లకు చుక్కలు చూపించిన బుమ్రా.. ఇషాన్ కిషన్‌కు గాయం

Jasprit bumra troubles team Indian batters in optional training session
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం  ప్రాక్టీస్ సెషన్
  • నెట్‌లోనూ దూకుడు ప్రదర్శించిన బుమ్రా
  • బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం
  • కాసేపటికే ఇషాన్ మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించిన వైనం
వరల్డ్ కప్‌లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత్, ఆదివారం చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే, ఈ రసవత్తర పోరుకు ముందు టీమిండియా క్రీడాకారులు బుధవారం నెట్ నెషన్‌లో పాల్గొన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఆప్షనల్ సెషన్‌లోనూ జస్ప్రీత్ బుమ్రా హైలైట్‌గా నిలిచాడు. టీం ఇండియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇది ప్రాక్టీస్ అయినా, ఎదురుగా ఉన్నది తన టీం సభ్యులే అయినా బుమ్రా తన దూకుడు కొనసాగించాడు. దీంతో, టీం సభ్యులు అతడి బౌలింగ్‌లో కాస్తంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. 

కచ్చితమైన లెంగ్త్‌తో బుమ్రా వేసిన ఓ బంతి ఇషాన్ కిషన్ కడుపు భాగంలో తాకడంతో అతడికి స్వల్ప గాయమైంది. అయితే, కొన్ని నిమిషాల తరువాత కోలుకున్న అతడు మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇక సిరాజ్, షమీ, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న శుభ్‌మన్ గిల్ కూడా బుమ్రా విషయంలో సంయమనం పాటిస్తూ ఆడాడు. ఆఫ్ స్టంప్ టార్గెట్‌గా బుమ్రా సంధిస్తున్న నెమ్మదైన డెలివరీలతో శుభ్‌మన్ గిల్ స్పీడుకు బ్రేకులు పడ్డాయి.  

చకచకా వికెట్లు తీస్తూ మైదానంలో మెరుపులు మెరిపిస్తున్న మహమ్మద్ షమీకి భిన్నంగా బుమ్రా బౌలింగ్ పంథా సాగుతోందనేది క్రికెట్ పండితుల మాట. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లపై ఒత్తిడి పెంచి వికెట్లు జారవిడుచుకునేలా చేస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో పదహారు వికెట్లతో షమీ స్టార్‌గా నిలిస్తే.. పరుగులు పొదుపు చేయడంలో తనకు తానే సాటని బుమ్రా నిరూపించాడు. ఎనిమిది మ్యాచుల్లో 3.65 పరుగుల సగటు.. బుమ్రా పొదుపైన బౌలింగ్‌కు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Ishan Kishan
Jasprit Bumra
Bengaluru
Team India
Cricket

More Telugu News