Pawan Kalyan: అందుకే పదేళ్లు తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నాం: అభ్యర్థులకు బీఫామ్‌లు అందించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reveals why he was not contested in telangana for ten years
  • ఎనిమిది మంది అభ్యర్థులకు బీఫామ్స్ అందించిన పవన్ కల్యాణ్
  • బలిదానాలు చేసుకున్న విద్యార్థుల గౌరవార్థం హోంరూల్ పాటించాలనే పోటీకి దూరంగా ఉన్నట్లు వెల్లడి
  • బలిదానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్న జనసేనాని
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బీఫామ్‌లు అందించారు. బీజేపీతో పొత్తు కొలిక్కి వచ్చాక మంగళవారం ఎనిమిది నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. వారికి జనసేనాని నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు.

హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటామన్నారు. 2008లోనే తాను తెలంగాణవ్యాప్తంగా తిరిగి ఇక్కడి ప్రజల బాధలను అర్థం చేసుకున్నానని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు.

తెలంగాణ ఆవిర్భవించిన దశాబ్దకాలం తర్వాత జనసేన ఇక్కడ పోటీ చేస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందన్నారు. ఏపీపై దృష్టి సారిస్తూనే తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు చెప్పారు. 1200 మందికి పైగా యువత, విద్యార్థుల ఆత్మగౌరవార్థం హోంరూల్ పాటించాలనే ఆలోచనతో దశాబ్దం పాటు పోటీకి దూరంగా ఉన్నట్లు చెప్పారు.
Pawan Kalyan
Janasena
Telangana Assembly Election
Hyderabad

More Telugu News