Singer Chinmayi: మహిళలపై అత్యాచారాలకు తదుపరి ఆయుధంగా ‘డీప్‌ఫేక్’.. సింగర్ చిన్మయి ఆందోళన

  • సామాన్యులు కూడా బాధితులుగా మారుతున్నారన్న చిన్మయి
  • ఏఐ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • మహిళల మార్ఫింగ్ ఫొటోలతో లోన్‌యాప్‌లు వేధిస్తున్నాయన్న సింగర్
AI is the next weapon to rape women Singer Chinmayi concern

సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దుష్ప్రభావాలను కళ్లకు కట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా ఇంకా చర్చ కొనసాగుతోంది. తాజాగా గాయని శ్రీపాద చిన్మయి స్పందించారు. సెలబ్రిటీలను మాత్రమే కాదని, ఇలాంటి వీడియోలతో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆమె.. దోపిడీ, బ్లాక్‌మెయిల్, అత్యాచారం వంటివాటికి డీప్‌ఫేక్ టెక్నాలజీని తదుపరి ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  

మరీ ముఖ్యంగా లోన్‌యాప్‌ల నిర్వాహకులపై చిన్మయి మరింత ఆందోళన వ్యక్తం చేశారు. అప్పు తీసుకున్న మహిళల నుంచి డబ్పులు తిరిగి రాబట్టేందుకు, మరింతగా వారిని దోచుకునేందుకు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి ‘పోర్న్ ఫొటోలు’గా మార్చి వేధిస్తున్నారని పేర్కొన్నారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన వాటిని సాధారణ కంటితో గుర్తించడం కష్టమని తెలిపారు. డీప్‌ఫేక్ సాంకేతికతపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, సామాన్య ప్రజలకు దీనిపై వెంటనే అవగాహన కల్పించాలని కోరారు.

More Telugu News