Revanth Reddy: అలా చేస్తే నేను నామినేషన్ కూడా వేయను: రేవంత్ రెడ్డి సవాల్

Revanth Reddy in congress praja garjana sabha
  • ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుందన్న రేవంత్ రెడ్డి
  • ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ 14కు 14 సీట్లు గెలవాలని వ్యాఖ్య 
  • మనం నిధులు అడిగేందుకు సిద్దిపేట... సిరిసిల్ల... చింతమడక వెళ్లాలా? అంటూ రేవంత్ ప్రశ్న
ధరణిని రద్దు చేస్తే రైతుబంధు రాదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రూ.100 కోట్లతో జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని, కానీ ఈ రోజు ఆ గుడి పరిస్థితి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నారు. తమ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ ఇక్కడి నుంచి గెలవాలని అమ్మవారిని దర్శించుకొని వచ్చానన్నారు. తామేదో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఉచిత విద్యుత్ ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ వస్తుందా? సబ్ స్టేషన్‌లకు వెళ్ళి చూద్దామా? అని సవాల్ చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ ఇస్తుందన్నారు. ఇప్పుడు 24 గంటల విద్యుత్ వస్తోందని నిరూపిస్తే తాను నామినేషన్ కూడా వేయనని సవాల్ చేశారు.

కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదన్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తామని మోసం చేశారన్నారు. ఆ వర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత తనది అన్నారు. ఇక్కడ ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

మనం నిధులను అడిగేందుకు సిరిసిల్ల... సిద్దిపేట.. చింతమడక వెళ్లాలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సహా ఆ కుటుంబమంతా దళారులే అని ఆరోపించారు. ధరణి స్థానంలో మరింత అత్యున్నత ప్రమాణాలతో యాప్ తీసుకు వస్తామన్నారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ పేదవాడికి వచ్చాయో చూద్దామా? అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది... డబుల్ బెడ్రూం ఇచ్చినచోట మీరు అడిగేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ పార్టీ 14కు 14 సీట్లు గెలవాలన్నారు.
Revanth Reddy
Congress
alampur
Telangana Assembly Election

More Telugu News