కోహ్లీ సెంచరీ కొట్టినట్లు కేసీఆర్ కూడా సెంచరీ కొడతారు: కేటీఆర్
- 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందన్న కేటీఆర్
- తెలంగాణ స్టోరీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కేసీఆర్‌దే అన్న మంత్రి
- కానీ కాంగ్రెస్ సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్ అని ఎద్దేవా
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటోంది కానీ నవంబర్ 30న తెలంగాణ సిక్స్ కొడుతుందన్న కేటీఆర్
ఢిల్లీ చేతికి జుట్టు ఇస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రిని మారుస్తారన్నారు. తమ పార్టీ తరఫున ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేసినా అతనిని కేసీఆరే అనుకోవాలన్నారు. అవతలి పార్టీకి ఓటేస్తే అది ఢిల్లీకి, గుజరాత్‌కు వెళుతుందన్నారు. వేములవాడకు పరిశ్రమలు తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. మెజార్టీ విషయంలో సిరిసిల్లతో పోటీ పడాలని సూచించారు.
సిక్స్ పాయింట్ ఫార్ములాను ఇందిరా గాంధీ తుంగలో తొక్కారని, ఇప్పుడు ఆమె మనవడు రాహుల్ గాంధీ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణకు వచ్చి ఆరు గ్యారెంటీలు అంటున్నారని, కానీ నవంబర్ 30న తెలంగాణ సిక్స్ కొట్టుడు ఖాయమన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టినట్లు కేసీఆర్ సెంచరీ కొడతారన్నారు. 100 సీట్లతో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం పక్కా అని స్పష్టం చేశారు.