Diwali Special trains: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. ఏపీ ప్రయాణికులకు స్పెషల్

  • చెన్నై-భవనేశ్వర్, చెన్నై-సంత్రాగచ్చి మధ్య రైలు సర్వీసులు
  • ఏపీలోనూ ఆగనున్న రైళ్లు
  • గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస వాసులకు ఉపయోగం
Railways arrages special trains on diwali that pass through ap

దీపావళి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం భారత రైల్వే పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో కొన్ని ఏపీ స్టేషన్లలోనూ ఆగనున్నాయి. రైల్వే శాఖ ప్రకటన ప్రకారం, నవంబర్ 13, 20, 27 తేదీల్లో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైలు సర్వీసు (నెంబర్ 06073) నిర్వహించనున్నారు. ఈ రైలు చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 11.45కి బయల్దేరి, మర్నాడు సాయంత్రం 6.30కి భువనేశ్వర్‌ చేరుకుంటుంది. కాగా, తిరుగు ప్రయాణానికి సంబంధించి ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్‌ నుంచి చెన్నై సెంట్రల్‌‌కు ప్రత్యేక రైలు సర్వీసును కూడా (నెంబర్ 06074) రైల్వే సిద్ధం చేసింది. భువనేశ్వర్‌ స్టేషన్ నుంచి ఈ రైలు రాత్రి 9కి బయల్దేరి, మర్నాడు మధ్యాహ్నం 3కి చెన్నై చేరుకుంటుంది. చెన్నై-భవనేశ్వర్ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు పేర్కొన్నారు. 

చెన్నై సెంట్రల్-సంత్రాగచ్చి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నవంబర్ 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి  సంత్రాగచ్చి వరకూ స్పెషల్ సూపర్ ఫాస్ట్ (నెంబర్ 06071) ఏర్పాటు చేశారు. చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45కి ఈ రైలు బయల్దేరి, మూడో రోజు తెల్లవారుజామున గం.3.45కి సంత్రాగచ్చికి చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27 తేదీల్లో సంత్రాగచ్చి నుంచి చెన్నై సెంట్రల్‌‌కి ప్రత్యేక సూపర్‌ ఫాస్ట్‌ రైలు (నెంబర్ 06072) నిర్వహించనున్నారు. సంత్రాగచ్చిలో తెల్లవారు జామున 5కి బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు  ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి.

More Telugu News