Pakistan: అదృష్టమంటే ఇదే... వాన దెబ్బకు మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్

  • బెంగళూరులో ఎంతకీ తగ్గని వాన
  • 21 పరుగుల తేడాతో నెగ్గిన పాకిస్థాన్
  • డీఎల్ఎస్ ప్రకారం విజేతను తేల్చిన అంపైర్లు
  • ఈ మ్యాచ్ లో మొదట  50 ఓవర్లలో 6 వికెట్లకు 401 రన్స్ చేసిన కివీస్
  • వర్షం వల్ల మ్యాచ్ నిలిచే సమయానికి పాక్ స్కోరు 25.3 ఓవర్లలో 200-1
Pakistan best New Zealand by 21 runs in rain hit match

వర్షం వస్తే వచ్చింది కానీ, బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. న్యూజిలాండ్ పై 402 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ ఇన్నింగ్స్ లో రెండోసారి వచ్చిన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం పాక్ ను విజేతగా ప్రకటించారు. 

అంతకుముందు, తొలిసారి వర్షం వచ్చినప్పుడు పాక్ ఆడాల్సిన ఓవర్లను 41కి తగ్గించారు. ఛేదించాల్సిన లక్ష్యాన్ని 342 పరుగులుగా నిర్దేశించారు. రెండోసారి వర్షం పడే సమయానికి పాక్ 25.3 ఓవర్లలో 1 వికెట్ కు 200 పరుగులు చేసింది. అప్పటికి డీఎల్ఎస్ సమీకరణానికి పాక్ 21 పరుగులు ఎక్కువే చేసింది. దాంతో పాక్ నే విజేతగా ప్రకటించారు. 

ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్ టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ కూడా 8 మ్యాచ్ ల్లో 4 విజయాలు సాధించినప్పటికీ, రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో పాక్ కంటే ఒక మెట్టు పైన నాలుగో స్థానంలో ఉంది. 

పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 11న ఇంగ్లండ్ తో ఆడనుండగా, న్యూజిలాండ్ తన చివరి లీగ్ పోరును ఈ నెల 9న శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయి, ఇంగ్లండ్ పై పాకిస్థాన్ నెగ్గితే టోర్నీలో ఆసక్తికర పరిస్థితి నెలకొంటుంది. అప్పుడు పాకిస్థాన్ కు సెమీస్ చాన్సు ఉంటుంది. అలా కాకుండా, పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ల్లో నెగ్గితే రన్ రేట్ కీలకమవుతుంది. 

ఇక్కడో ట్విస్టు ఉంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు 7 మ్యాచ్ ల్లోనే 4 విజయాలు సాధించి సెమీస్ బెర్తు కోసం కాచుకుని ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా, వీటిలో ఒక్క మ్యాచ్ నెగ్గినా... పాకిస్థాన్, కివీస్ జట్లతో సెమీస్ బెర్తు కోసం పోటీ పడుతుంది. ఆఫ్ఘన్ గనుక రెండు మ్యాచ్ ల్లో నెగ్గితే... పాకిస్థాన్, కివీస్ లకు కష్టమే. అయితే ఆఫ్ఘన్లు ఆడాల్సింది ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లతో కావడం వల్ల ఏమైనా సంచలనాలు జరిగితే తప్ప ఫలితాలు అందరూ ఊహించిన విధంగానే వస్తాయి.

ఇవాళ ఆస్ట్రేలియా... ఇంగ్లండ్ తో ఆడుతోంది. ఈ పోరులో ఆసీస్ గెలిస్తే మూడో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది. ఇవాళ పాకిస్థాన్ గెలవడంతో దక్షిణాఫ్రికా కూడా సెమీస్ లో అడుగుపెట్టింది. కివీస్ తో పోరులో పాకిస్థాన్ ఓడిపోయి ఉంటే సెమీస్ సమీకరణాలు మరోలా ఉండేవి.

More Telugu News