Pakistan: ఫఖార్ జమాన్ సూపర్ సెంచరీ... పాక్ ఛేజింగ్ కు వర్షం అడ్డంకి

  • బెంగళూరులో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్
  • 21.3 ఓవర్లలో 1 వికెట్ కు 160 పరుగులు చేసిన పాక్ 
Rain halts Pakistan massive chasing

వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్ నమోదు చేసిన 401 పరుగుల భారీ స్కోరు చూస్తే ఎంత పెద్ద జట్టుకైనా గుండె గుభేల్మంటుంది. అయితే, కొండంత లక్ష్యం కళ్ల ముందు నిలిచినప్పటికీ, పాకిస్థాన్ జట్టు ఆశావహ దృక్పథంతో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ ఫఖార్ జమాన్ అద్భుత సెంచరీతో పాక్ దీటుగా బదులిస్తోంది. 402 పరుగుల లక్ష్యఛేదనలో ప్రస్తుతానికి పాక్ స్కోరు 21.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 160 పరుగులు. ఈ దశలో జల్లులు పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

అంతకుముందు, ఫఖార్ జమాన్ పిడుగుల్లాంటి షాట్లతో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఫఖార్ 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. మరో ఎండ్ లో కెప్టెన్ బాబర్ అజామ్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. బాబర్ 51 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (4) ఆరంభంలోనే అవుటైనప్పటికీ... ఫఖార్, బాబర్ జోడీ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ పై ఆశలు కల్పించింది. 

కాగా, వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి డీఎల్ఎస్ సమీకరణాలు పాక్ కు అనుకూలంగా ఉన్నాయి. డీఎల్ఎస్ స్కోరుకు పాక్ 10 పరుగులు ఎక్కువే చేసింది. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాక్ ను విజేతగా ప్రకటిస్తారు.

More Telugu News