Sachin Tendulkar: రేపు హైదరాబాద్‌కు సచిన్ టెండూల్కర్.. ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’ను ప్రారంభించనున్న క్రికెట్ దిగ్గజం

  • గచ్చిబౌలిలో రేపు ‘హైదరాబాద్ హాఫ్ మారథాన్’
  • నిర్వహిస్తున్న ఎన్‌ఈబీ స్పోర్ట్స్
  • మారథాన్‌లో పాల్గొననున్న 8 వేల మంది
Sachin Tendulkar to flag off Hyderabad Half Marathon

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రేపు (ఆదివారం) హైదరాబాద్ రానున్నాడు. ఎన్ఈబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో రేపు తెల్లవారుజామున జరగనున్న మారథాన్‌కు సచిన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మారథాన్‌లో మొత్తం 8 వేల మంది రన్నర్లు పాల్గొంటారు. మూడు విభాగాలుగా జరిగే ఈవెంట్‌లో ఉదయం 5.15 గంటలకు 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ ప్రారంభం అవుతుంది. ఆరున్నర గంటలకు 10కే, 7.45 గంటలకు 5కే రన్ ప్రారంభమవుతుంది.  ‘రన్ ఏజ్‌లెస్.. రన్ ఫియర్‌లెస్’ థీమ్‌తో ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.

ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారథాన్‌లో పాల్గొనేవారు వయసు గురించిన ఆలోచనలకు అతీతంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వయసును సంఖ్యకు పరిమితం చేయొద్దని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉన్నప్పుడే కాదని, ఏ వయసులో అయినా ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించవచ్చని సూచించాడు. భారత్‌ను క్రీడలు ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చేందుకు అన్ని వయసుల వారి భాగస్వామ్యం అవసరమని సచిన్ పేర్కొన్నాడు.

More Telugu News