IPL: ఐపీఎల్ పై కన్నేసిన సౌదీ అరేబియా

  • బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతులా ఐపీఎల్
  • ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం
  • ఐపీఎల్ లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడంపై సౌదీ ఆసక్తి
Saudi Arabia show keen interest on IPL

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై సౌదీ అరేబియా ఆసక్తి చూపుతోంది. ప్రతి ఏడాది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి వేల కోట్ల రూపాయల ఆదాయం అందిస్తున్న ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా భావిస్తోంది. 

ఐపీఎల్ ను 30 బిలియన్ డాలర్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చే అంశంపై సౌదీ అరేబియా పాలకుడు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు భారత కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టు బ్లూంబెర్గ్ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబరులో భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగానే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 

ఐపీఎల్ లో 5 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెడతామని, ఐపీఎల్ ను ఇతర దేశాలకు కూడా విస్తరించేందుకు సహకారం అందిస్తామని సౌదీ యువరాజు బృందం ప్రతిపాదించింది. దీనిపై రాయిటర్స్ మీడియా సంస్థ వివరణ కోరగా, బీసీసీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

2008లో ప్రారంభమైన ఐపీఎల్ అంతకంతకు ఎదుగుతోంది. 2023-28 కాలానికి టెలివిజన్ ప్రసార హక్కుల రూపేణా బీసీసీఐకి రూ.23,575 కోట్లు లభించనుండడం ఐపీఎల్ సత్తాకు నిదర్శనం. అదే సమయంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐకి రూ.20,500 కోట్ల రాబడి దక్కనుంది. 

ఈసారి ఆటగాళ్ల వేలాన్ని దుబాయ్ లో డిసెంబరు 19న నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని భారత్ వెలుపల నిర్వహించడం ఇదే ప్రథమం. 

ఐపీఎల్ జట్లు ఇప్పటికే విదేశీ క్రికెట్ లీగ్ ల్లోనూ ఫ్రాంచైజీలు తీసుకోవడం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా, యూఏఈ క్రికెట్ లీగ్ ల్లోనూ జట్లను సొంతం చేసుకున్నాయి.

More Telugu News