Telangana Assembly Election: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: ఎన్నికల సంఘానికి తెలిపిన తెలంగాణ సీఎస్

  • డీజీపీలు, సీఈవోలు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్న శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్
  • సరిహద్దుల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
CEM videos conference with cs and dgp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లు మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు.

ఇక రాష్ట్రంలో నిఘా పెంచామన్నారు. ఇప్పటి వరకు రూ.385 కోట్ల మేర నగదును జఫ్తు చేసినట్లు చెప్పారు. 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దు రాష్ట్రాలతో సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 28 నుంచి ఎన్నికలు జరగనున్న నవంబర్ 30 వరకు అంటే మూడురోజులు రాష్ట్రంలో డ్రైడేగా ప్రకటించామన్నారు. ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు.

More Telugu News